ఈ భాగంలో అనుభవం:
- వెంట వున్నానని నిదర్శనం చూపించిన సాయి
నా పేరు శ్రీవాణి. పిలిచిన వెంటనే పలుకుతూ, తమ భక్తులని అనుక్షణం రక్షించే సాయినాథుని లీలలు అంతటా మారుమ్రోగాలని 2026, జూలై 13న బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవం మీ అందరితో పంచుకుంటున్నాను. దీన్ని చాలా వివరంగా వ్రాస్తున్నాను. ఎందుకంటే, నేను ఆరోజు ప్రతి నిమిషం సాయి ఉనికిని అనుభూతి చెందాను. ఆ అద్భుత క్షణాలలోని సాయి ప్రేమని, రక్షణని మీ అందరూ అనుభూతి చెందాలని నా ఈ ప్రయత్నం. ఇక నా అనుభవానికి వస్తే.. నేను ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నాను. మాకు అప్పుడప్పుడు ట్రైనింగ్ ఉంటుంది. ఆ క్రమంలో 2026, జూలై 13న టైనింగ్ మెదక్‌లో పెట్టారు. అందువల్ల నేను ఆరోజు మెదక్ వెళ్లాల్సిన అవసరం వచ్చింది. అయితే, నా కాలికి యాక్సిడెంట్ అయి, 4నెలల బెడ్ రెస్ట్ తర్వాత అంతదూర ప్రయాణం చేయాల్సి రావడం అదే మొదటిసారి. ankle ligament tear (చీలమండ లిగమెంట్ టియర్ లేదా చీలమండ బెణుకు) ఇంకా పూర్తిగా నయం కాలేదు. అందువల్ల నేను బస్సు ఎక్కలేని పరిస్థితి. కాబట్టి ఎక్కడకి వెళ్లాలన్నా కారు లేదా ఆటోలో వెళ్లి వస్తున్నాను. అలాంటిది ట్రైనింగ్‌కోసం మెదక్ వెళ్లాల్సిన సమయానికి నా కారు రిపేరులో ఉంది. నా సహోద్యోగులు వెళ్లే వాహనాల్లో వెళదామని ప్రయత్నించాను కానీ, వాళ్ళ కార్లలో నాకు చోటు లేకపోయింది. ఇంకా నేను, "బాబా! మీరే ఏదైనా కారు నాకు ఏర్పాటు చేయాలి" అని అనుకున్నాను. ఆశ్చర్యకరంగా మరునిమిషంలోనే ఒక సహోద్యోగి నాకు కాల్ చేసి, "ట్రైనింగ్‌కి వెళ్లాడనికి కారు ఏర్పాటు అయింది. మీరు మా కారులో రావొచ్చు" అని చెప్పాడు. నేను వెంటనే ఆనందంగా బాబాకి కృతజ్ఞతలు చెప్పుకున్నాను.
అయితే, నా సహోద్యోగివాళ్ళు వేరే చోట నుండి వస్తుండటం వల్ల నేను మా ఊరికి కొద్దిదూరంలో వున్న మరో ఊరు వరకు వెళ్లి, వాళ్ళ కారు అందుకోవాల్సి వుంది. ఆ ఊరికి వెళ్ళడానికి నేనుంటున్న ఊరి నుండి బస్సులు, ఆటోలు వెళ్లవు. కానీ సాయి దయవలన వెళ్లే రోజు ఉదయం కష్టం మీద ఒక ఆటో దొరకడంతో అందులో ఆ ఊరు వెళ్లి నా సహోద్యోగివాళ్ళ కారు అందుకున్నాను. మెదక్‌లో ట్రైనింగ్ ముగిసాక తిరిగి వచ్చేప్పుడు నా సహోద్యోగివాళ్ళు నన్ను వేరే ఊరిలో దించి వెళ్లిపోయారు. నేను ఆ ఊరి సెంటర్‌లో ఆటోకోసం వేచి చూస్తూ నిలబడ్డాను. అది సాయంకాలం అవడం, అదికాక నేను వెళ్ళాల్సింది మారుమూల ప్రదేశం అవడం వలన ఆ సమయంలో ఆటోలు అటువైపు రావని తెలిసింది. నా ముందునుంచి బస్సు వెళ్తున్నా నా కాలి సమస్య వల్ల ఎక్కలేక చాలా సంకట స్థితిలో అలా ఉండిపోయి బాబాని తలచుకొని, "బాబా! ఏదైనా వెహికల్ చూపించు. నన్ను క్షేమంగా ఇంటికి చేర్చు. ఈ పరిస్థితిలో మీరు నా వెంటే ఉన్నట్లు నాకు కనిపించండి" అని ప్రార్ధించాను. తర్వాత అక్కడే వేచి చూస్తుండగా నా ముందు వెళుతున్న వాహనాలపై రెండుసార్లు 'సాయి' దర్శనమిచ్చారు. కానీ అవి స్టికర్స్ రూపంలో ఉండటం వల్ల నాకు అంత సంతృప్తి అనిపించక, "బాబా! నువ్వు సజీవంగా వున్న ఫోటో రూపంలో నన్ను చూస్తూ కనిపించు" అనుకున్నాను. వెంటనే నా పక్కనుండి వెళ్తున్న వాహనంపై సరిగ్గా మా ఇంట్లో వున్న ఫోటో రూపంలోనే సాయి అందంగా దర్శనమిచ్చారు. నేను చాలా సంతోషించాను. ఆ వెంటనే ఆశ్చర్యంగా ఒక ఆటో, దాన్ని అనుసరిస్తూ దాని వెనుక మరో ఆటో వచ్చాయి. వాటిలో నేను వెళ్లాల్సిన మార్గంలో కొద్దిదూరం వరకు ప్రయాణం చేసే అవకాశం దొరికింది. ఆరా తీస్తే, తెలిసిన విషయం ఏంటంటే, "కొత్తగా ఆటో నేర్చుకొని ఆటోని ఊరికి తీసుకెళ్తున్న తన బంధువుల అబ్బాయిని, నేను ఎక్కిన ఆటో అతను వెంబడిస్తూ వెంట వెళ్తున్నాడ'ని. దాంతో సాయి నా కోసం ఆ పరిస్థితిని కల్పించి ఆ ఆటో పంపారని ఆనందపడ్డాను. కొంతదూరం వెళ్ళాక ఆ ఆటో దిగాను. ఇంకా సగం దూరం వెళ్లాల్సి ఉంది. "మళ్ళీ ఏంటి పరిస్థితి బాబా! ఎవరైనా మంచి వ్యక్తి లిఫ్ట్ ఇచ్చేలా చూడు" అని సాయిని తలచుకున్నాను. అప్పటికి చీకటి పడింది. ఒక కారు వస్తుండటంతో ఆపాను. కారు నడుపుతున్న అతను నన్ను చూసి కారు ఆపి, తను చేరాల్సిన గమ్యం వచ్చినప్పటికి కూడా నేను ఒక్కదాన్నే ఉండటం గమనించి నన్ను కారు ఎక్కించుకుని కొంతదూరం కారుని ముందుకు పోనిచ్చి, నన్ను మా ఇంటి దగ్గర దించి మరీ అతను తిరిగి వెళ్ళాడు. దారిలో అతను నాతో, "ఆ మార్గం మంచిది కాదని. ఆ దారిలో దారి దోపిడీలు జరుగుతాయని, చుట్టూ అడవి ప్రదేశం కాబట్టి ఎప్పుడూ ఇలా రిస్క్ తీసుకోవద్దు. రోజులు బాగా లేవ"ని చాలా ఆప్యాయంగా చెప్పాడు. ఆ కారు నాకు కనిపించకపోయుంటే ఏ వాహన సౌకర్యం లేని ఆ దారిలో నేను ఇల్లు చేరడం చాలా కష్టమయ్యేది. సాయే ఆ రూపంలో వచ్చి నన్ను ఇంటి దగ్గర దింపి వెళ్లారని అనిపించింది. ఇలా అడుగడుగునా సాయి నా వెంట వున్నానని నిదర్శనంగా చూపించారు. ఇంటిలోకి వెళ్లి సాయిని చూసి ఏడ్చేసాను. నేను మనసులో ఎప్పుడూ, 'ప్రతి సమస్యలో, ప్రతి నిమిషం నువ్వు నాకు తోడుగా ఉండి నన్ను జీవితంలో ముందుకు తీసుకెళ్ళు సాయి' అని అనుకుంటుంటాను. దానికి తగ్గట్టే సాయి అనుగ్రహం చూపిస్తున్నారు. "సాయిదేవా!! ఎల్లప్పుడూ మీ రక్షణను ఇలాగే చూపిస్తూ నా వెంట ఉండి నన్ను నడిపించు తండ్రీ".

Om Sai Ram 🙏🙏🙏
ReplyDeleteOm Sai Ram 🙏🙏
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me