ఈ భాగంలో అనుభవం:
- బాబా ఇచ్చిన పునర్జన్మ
నేను ఒక సాయి భక్తురాలిని. బాబా గురించి నాకు తెలిసింది చాలా తక్కువ. ఈ బ్లాగ్ ద్వారానే చాలా విషయాలు తెలుసుకుంటున్నాను. ప్రతివారికి తమ జీవితంలో ఏదో ఒక సమయం/వయస్సులో ఎవరో ఒక భగవంతుని మీద శ్రద్ధ కలుగుతుంది. నా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో అందరి దేవుళ్ల ఫొటోలతో పాటు బాబా ఫోటో ఉండేది. ఆయన నాకు తెలియకుండానే నన్ను తమకు దగ్గర చేసుకున్నారని తెలుసుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది. నా చదువు అయిపోయి ఉద్యోగం చేయడానికి సిటీకి వెళ్ళినప్పుడు నేనుండే హాస్టల్‌కి దగ్గర్లో ఒక సాయిబాబా గుడి ఉండేది. ప్రతి గురు, శని, ఆది వారాల్లో వీలును బట్టి ఆరతికి వెళ్లడం నాకు అలవాటైంది. పెళ్ళైన తర్వాత మా వారితో కలిసి విదేశాల్లో ఉంటున్నాను. మావారికి కూడా భగవంతుడిపై నమ్మకం, విశ్వాసం ఎక్కువగా ఉండటం వల్ల మాకు కుదిరినప్పుడల్లా గుడికి వెళ్తుంటాము. అందులోనూ బాబా గుడికి ఎక్కువగా వెళ్తుంటాము. కానీ నిజమైన బాబా ప్రేమను, తమను సంపూర్ణంగా విశ్వసించిన వారి జీవితాలలో ఆయన చేసే లీలలు ఎలా ఉంటాయో ఈమద్యనే తెలుసుకుంటున్నాను.
మేము విదేశాలకు వచ్చినప్పుడు ఇండియా నుండి తెచ్చుకున్న ఒకేఒక్క దేవుని పటం కాకుండా ఇంట్లో ఇంకేదైనా దేవుడి ఫోటో కూడా పెట్టుకోవాలని నాకనిపించి బాబా ఫోటో ప్రింట్ తీయించి పూజా మందిరంలో పెట్టుకున్నాను. అలా మొదటిసారి బాబా మా ఇంటికి వచ్చారు. కొన్నాళ్ల తర్వాత ఒక స్నేహితురాలి దగ్గరున్న పాత సాయి సచ్చరిత్ర పుస్తకం అనుకోకుండా నా దగ్గరకు వచ్చింది. నేను దాన్ని తిరిగి ఇవ్వడం మర్చిపోయాను. కానీ ఎప్పుడూ ఆ పుస్తకం తెరిచి చదవలేదు. నాకు వర్క్ పర్మిట్ వస్తూనే నేను ఒక చిన్న ఉద్యోగంలో చేరాను. తర్వాత నా అర్హతకు తగిన ఉద్యోగం రావట్లేదని బాధపడ్డాను. కానీ కోవిడ్, నాకు పాప పుట్టడం వల్ల కుదరక అదే ఉద్యోగంలో కొనసాగి 2022 వచ్చినప్పటి నుండి ఎలాగైనా ఒక మంచి ఉద్యోగం తెచ్చుకోవాలని చాలా ప్రయత్నాలు చేశాను. కానీ ప్రయోజనం లేకపోయింది. అప్పుడు ఒకసారి నాకెందుకో నా దగ్గరున్న సచ్చరిత్ర చదవాలనిపించింది. దాంతో 2023, ఆగస్టులో మొదటిసారి సచ్చరిత్ర పారాయణ మొదలుపెట్టాను. తరువాత బాబా గుడికి వెళ్లి, "మంచి ఉద్యోగం వస్తే మొదటి నెల జీతం మీకు సమర్పించుకుంటాను. అలాగే సచ్చరిత్ర పారాయణ అనంతరం నవగురువార వ్రతం చేసుకుంటాన"ని బాబాని వేడుకున్నాను. అలాగే పారాయణ పూర్తయ్యాక వ్రతం మొదలుపెట్టాను. దాదాపు 2 వారాల అనంతరం నా కుడివైపు ఛాతిలో నొప్పి, కొంచెం వాపు ఉండడం గమనించి హాస్పిటల్‌కి వెళితే, డాక్టర్ రకరకాల స్కాన్‌లు చేసి చివరికి, "ఏదో అనుమానంగా ఉంది. బయాప్సీ కూడా చేయాలి" అని అన్నారు. ఒక్కసారిగా నా జీవితం తలకిందులైనట్లనిపించింది. జీవితంలో ముందెన్నడూ అలాంటి కష్టాన్ని ఎదుర్కొని నాకు ఆ బాధను తట్టుకోవడం చాలా కష్టమైంది. నా బాధను పంచుకోడానికి దగ్గర్లో ఎవరూ లే రు. దూరంగా ఉన్నవాళ్లకి చెప్పి వాళ్ళని భయపెట్టలేక టెస్టులన్నీ అయ్యేదాకా ఎవరికీ చెప్పకూడదు అనుకున్నాము. అయితే ఆ రోజు నుండి మేము పడిన నరకం మాటల్లో చెప్పలేనిది. నేను రోజూ బాబా ముందు కూర్చుని నన్నెందుకిలా పరీక్షిస్తున్నారని అడిగేదాన్ని . మిగిలిన వారాలు వ్రతం కొనసాగిస్తూ ప్రతిరోజూ బాబా ఫోటోని హత్తుకొని బోరున ఏడ్చేదాన్ని. ఒకరోజు పూజ అయిన తర్వాత, "మొదటిసారి మిమ్మల్ని నమ్మి ఈ పూజ ప్రారంభించాను. ఇలా పరీక్ష పెడతారని అనుకోలేదు. కానీ ఏం జరిగినా నేను మీ పాదాలు వదలను బాబా. మీరు నా పూజ స్వీకరించారా బాబా?" అని అడిగాను. నేను అడిగిన ఆ ప్రశ్నకి 'మన ద్వారకమాయి శిరిడీ' అనే యూట్యూబ్ ఛానల్‌లో, "నేను నీ 9 వారాల పూజను ఆమోదించాను. 9 వారాల వ్రతంతో నీ కోరిక నెరవేరుతుంది. ప్రశాంతంగా ఉండు" అని బాబా సమాధానం వచ్చింది. నాకు చాలా షాకింగ్‌గా అనిపించింది. ఆరోజు నుండి ప్రతిరోజూ నాకు ఆ ఛానల్ నోటిఫికేషన్ వస్తుండేది. డాక్టరు దగ్గరకి వెళ్లిన ప్రతిసారీ నేను ఏదైతే బాబాను అడిగేదాన్నో దానికి సమాదానం ఆ ఛానెల్‌లో వచ్చేది. నేను ఆ ఛానెల్‌లో భక్తుల అనుభవాలు చదవడం మొదలుపెట్టాను. బాబా దయవల్ల బయాప్సీ రిపోర్టులో ఏమీ లేదు, అది కేవలం ఇన్ఫెక్షన్ అని వచ్చింది. కానీ ఆ సంతోషం రెండు రోజులు కూడా లేకుండా డాక్టర్, "నేను ఖచ్చితమైన ఫలితం కోసం సర్జికల్ బయాప్సీ చేయాలనుకుంటున్నాను" అన్నారు. నేను బాబాని తలుచుకుంటూ సర్జరీకి వెళ్లాను. సర్జరీ అనంతరం డాక్టర్, "రిపోర్టులు వచ్చిన తర్వాత మాట్లాడటానికి మీతోపాటు ఎవరైనా ఉండాలి" అని చెప్పారు. నేను చాలా భయపడ్డాను. రిపోర్టులు వచ్చిన తర్వాత నేను భయంభయంగా 'సాయి సాయి' అనుకుంటూ డాక్టర్ కోసం వేచి ఉన్నప్పుడు, “నీకు తెలీదు కానీ, నేను నీకోసం మౌనంగా పోరాడుతున్నాను. సమస్య నీ దగ్గరకు రాకముందే ఎదుర్కుంటాను. నీ పెద్ద సమస్యను చిన్నగా చేస్తాను" అని బాబా సందేశం వచ్చింది. తర్వాత డాక్టర్ వచ్చి, "నేను చాలా పెద్ద సమస్య(కాన్సర్) అని అనుమానించాను కానీ, ఇది చాలా చిన్న సమస్య" అని అన్నారు. బాబా చెప్పిన మాటే డాక్టర్ చెప్పేసరికి నాకు నోట మాట రాలేదు. డాక్టరు ఇంకా ఇలా చెప్పారు, "ముందు రిపోర్టులో వచ్చినట్లు అది ఇన్ఫెక్షన్ కూడా కాదు, హార్మోనల్ మార్పు వల్ల వచ్చిన రియాక్షన్. ప్రమాదమేమీ లేదు, సమయంతో పాటు తగ్గిపోతుంద"ని అన్నారు. ఆ తర్వాత కొన్ని మందులతో నా సమస్య పూర్తిగా తగ్గిపోయింది. చివరిగా ఒక మాట, నా ప్రతి టెస్టుకీ సంబంధించిన రిపోర్ట్ గురువారం వచ్చాయి. ఇదంతా బాబా లీల కాక మరేమిటి?
ఇది బాబా నాకిచ్చిన పునర్జన్మ. ఆయన నాకు రాబోయిన ఏదో పెద్ద కష్టాన్ని చాలా చిన్నదిగా చేసి కొద్దిపాటి కర్మను అనుభవింపజేసారు. నేను ఆరోజు నుండి బాబా నాకోసం ఏమైనా చేస్తారని గట్టిగా నమ్ముతున్నాను, బాబాపై విశ్వాసం నాకు మరింత పెరిగింది. నేను నా జీవితం పూర్తిగా బాబా పాదాల దగ్గర పెట్టేసాను. ఇప్పుడు నా ప్రతిరోజూ బాబా నామస్మరణతో మొదలై ఆయనతోనే ముగుస్తుంది. నాకు ఎదురయ్యే ప్రతి సమస్య/కష్టంలో బాబా నాకు అండగా ఉంటారని నాకు పూర్తి నమ్మకం. "బాబా! ఎల్లప్పుడూ ఇలాగే నన్ను, నా కుటుంబాన్ని మీరు కాపాడుతూ ఉంటారని నాకు తెలుసు. ఎప్పుడూ ఇలాగే నాకు,నా కుటుంబానికి నీ పైన ప్రేమ, భక్తి, విశ్వాసాలు ఉండేలా మేము నీకు మరింత దగ్గరయ్యేలా చూడు తండ్రీ. ధన్యవాదాలు బాబా. లవ్ యు బాబా".