సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

కృష్ణజీ లక్ష్మణ్ సోమన్ -- 2వ భాగం....



కృష్ణజీ లక్ష్మణ్ సోమన్ శిరిడీలో తాను గమనించిన విషయాలు గురించి ఇంకా ఇలా చెప్తున్నారు:


నేను శ్రీసాయిబాబా దర్శనానికి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు భాటే(భాటియా), పార్సీ మొదలైన వారి అందమైన భార్యలు, కుమార్తెలు కూడా వారి దర్శనానికి వచ్చేవారు. వాళ్ళు కొన్నిసార్లు శ్రీసాయిబాబా దగ్గర కూర్చునేవారు. అటువంటి సమయాల్లో కొంతమంది పురుషులు కూడా అక్కడ ఉండేవారు. వాళ్లలో ఎప్పుడూ అక్కడే ఉండేవాళ్ళు, బయటినుండి వచ్చినవాళ్ళు అనే రెండు రకాల వ్యక్తులు ఉండేవారు. ఈ వ్యక్తుల కళ్ళు సహజంగానే అక్కడున్న అందమైన స్త్రీల వైపు ఆకర్షింపబడేవి. మానవ స్వభావాన్ని చూస్తే, ఇది చాలా సహజమైన విషయం. కానీ బయటినుండి వచ్చిన వారి వైఖరి భక్తి, విశ్వాసాలతో, భావోద్వేగాలతో నిండి ఉన్నందున వారి ముఖాలపై ఎలాంటి ప్రత్యేక భావోద్వేగం కనిపించేది కాదు. వారి ముఖాలపై సాత్విక(ధర్మబద్ధమైన) భావాలు మాత్రమే ప్రకటమైనందున వాళ్ళు గంభీర స్వభావులుగా కనబడేవారు. కానీ ఎల్లప్పుడూ అక్కడే ఉండే వారి మనసులు మాత్రం చంచలమైనట్లు స్పష్టంగా కనిపించేది. శ్రీసాయిబాబా వైఖరి ఏ సమయంలోనూ, ఏ కారణంగానూ మారేది కాదు. ఆయన చాలా గంభీరంగా, ప్రశాంతంగా, స్థిర చిత్తంతో ఉన్నట్లు స్పష్టంగా కనిపించేది. ఆయన చాలా గంభీరంగా ఉన్నారని స్పష్టంగా తెలిసేది. వారి దర్శనానికి వచ్చిన ఆ అందమైన స్త్రీల హావభావాల్లో కూడా ఎలాంటి చంచలత్వం కనపడేది కాదు, దానికి విరుద్ధంగా నిష్కళంకమైన, స్వచ్ఛమైన వైఖరి, సాత్విక భావాలు స్పష్టంగా ప్రకటమవుతుండేవి. అటువంటి సన్నివేశాన్ని చూసినప్పుడు బయటినుండి వచ్చిన నా వంటి మనుషుల మనస్సులో మొదట ఏవైనా తప్పుడు లేదా పాపభావాలు కలిగినప్పటికీ వారి ఆ సాత్విక భావాల వల్ల అవి క్షణంలో మాయమైపోయి, వాటి స్థానంలో స్వచ్ఛమైన సాత్విక భావాలు వాటంతటవే ఉదయించేవి. నాకు అనిపించేది ఏమిటంటే, ‘సాధుసత్పురుషులను దర్శించడం వల్ల వేరే ఏ ప్రయోజనం లేకపోయినా, ప్రజల భావోద్వేగాలను శుద్ధిచేసే కార్యం వారికి తెలియకుండానే జరుగుతుంది. అది మామూలు ప్రయోజనం కాదు. సాధుసత్పురుషుల(మహాత్ముల) చరిత్రలు చదవడం ద్వారా జరిగే భావోద్వేగ శుద్ధి కార్యం వారి సాన్నిధ్యంలో, వారి ప్రత్యక్ష దర్శనం వల్ల మరింతగా జరుగుతుంది.


శ్రీసాయిబాబా ఎన్నడూ వేదాల గురించి మాట్లాడలేదు. భక్తి మార్గ ఉపదేశాలను కూడా వారి ప్రవర్తన, ఆచరణ, ప్రత్యక్ష ఉదాహరణల ద్వారా భోదించారు. ఇలా చెప్పడం అతిశయోక్తి అవుతుందని నేను అనుకోను. సాయిబాబా తమ దర్శనానికి వచ్చే భక్తులను అప్పుడప్పుడు 'గురుచరిత్ర' వంటి ప్రామాణిక గ్రంథాలను పఠించమని లేదా 'సప్తాహం' చేయమని సూచించేవారు. ఒకసారి 'ఓక్' అనే భక్తునితో గోవాలోని తన ఇంటిలో కూర్చొని 'గురుచరిత్ర' సప్తాహం చేయమని చెప్పారు బాబా.


మసీదులో శ్రీసాయి మహారాజ్ తీర్థ ప్రసాదాల పంపిణీ జరిగేది. ప్రజలందరూ వాటిని గొప్ప భక్తితో స్వీకరించేవారు. సాయిబాబా తాగిన పాత్రలో మిగిలిన నీరే ఆ తీర్థం. కొందరు దానిని స్వీకరించడానికి మొదట సంకోచించినప్పటికీ భక్తితోనో లేదా లోకవిరుద్ధంగా కనపడకుండా ఉండటానికో ప్రతి ఒక్కరూ దానిని తీసుకునేవారు. కుష్ఠురోగుల వంటి రోగగ్రస్తులకు మసీదులోకి రావడానికి ఎటువంటి నిషేధం లేనప్పటికీ, మశీదు నిర్వాహకులు అలాంటి వారు అక్కడికి రాకుండా ఏర్పాట్లు చేశారు. కనుక మహారాజ్ ఉదయం లెండికి వెళ్లే సమయానికి ఆ కుష్ఠురోగులు రహదారికి ఇరువైపులా నిలబడి మహారాజ్ దర్శనం కోసం ఎదురుచూసేవారు. ఆ సమయంలో వాళ్ళు మహారాజ్ పాదాలపై తమ తలను ఉంచి వారి దర్శనం చేసుకునేవారు. వారి స్పర్శ మహారాజ్ ముఖకవళికలలో ఎలాంటి మార్పు కలిగించేది కాదు. దానికి విరుద్ధంగా ఆయన కరుణ దృష్టితో వారిని చూస్తున్నట్లు అనిపించేది. నాలాంటి వ్యక్తులకు అదంతా వికారంగా, అత్యంత జుగుప్సాకరంగా, అంటువ్యాధి అన్న భయం కలిగించేదిగా ఉన్నప్పటికీ మహారాజ్ వైఖరిని చూసి ఆయనపై నాకు గౌరవం మరింత పెరిగింది. అంతేకాక, సత్పురుషుల వైఖరి(స్వభావం)లో దైవిక గుణాలు ఎలా ఉన్నతంగా ఉంటాయో కూడా నిరూపణగా చూడటం వల్ల ఒక విధమైన శిక్షణ లభించేది.


మహారాజ్ మసీదులో ఉన్నప్పుడు ఆయన వద్దకి చిన్న పిల్లలు వచ్చేవారు. వాళ్ళు చాలా అపరిశుభ్రంగా ఉన్నప్పటికీ, మహారాజ్ వాళ్ళని ఎత్తుకుని నవ్వుతూ నవ్వుతూ తమ ఒంటి మీద ఉన్న వస్త్రంతో వాళ్ళ ముక్కు, నోరు తుడిచి శుభ్రం చేసేవారు. ఆ తర్వాత వాళ్ళ చేతుల్లో పంచదార పలుకులు లేదా మరేవైనా తినుబండారాలు పెట్టేవారు. తద్వారా సహజాతిసహజంగా ఆయనకి అందరిపట్ల ఉండే సమత, మమతలు ప్రదర్శితమయ్యేవి. ఇది కూడా ఒక విధంగా భక్తులకు శిక్షణే.


శ్రీసాయిబాబా ఎప్పుడూ శాంతంగా, ఆనందంగా, సమచిత్తంతో ఉండేవారు. కానీ అప్పుడప్పుడు ఆయన మనో వైఖరి ఆకస్మికంగా మారిపోయి తీవ్రమైన భయాందోళనలు కలిగించేదిగా కనిపించేది. ఆయన రుద్రావతారం ధరించినట్లుగా అనిపించేది. ఒకరోజు రాత్రి నేను ఇతరులతో కలిసి రాధాకృష్ణమాయి ఇంటికి వెళ్లి, అక్కడ హారతి అయ్యాక తిరిగి వస్తుంటే, దారిలో మహారాజ్ ఒకటే కోపంతో ఊగిపోతూ కనిపించారు. ఆయన కళ్ళు ఎర్రబారిపోయాయి. ఆయన నిటారుగా నిలబడి, చేతిలోని కర్రను అటూ ఇటూ ఊపుతున్నారు. బాబా ఆ వైఖరి ప్రజలలో భయాన్ని పుట్టించగా పరుగులు తీయనారంభించారు. అటువంటి సంఘటనను నేను మొదటిసారి చూసినప్పుడు మహారాజ్ ఇంతలా ఆవేశపడటానికి కారణం ఏమిటో నా తర్కానికి అందలేదు. దీని గురించి నేను చాలామందిని అడిగాను. కానీ వారి నుండి నాకు సంతృప్తికరమైన సమాధానం లభించలేదు. ఇలాంటి ఆగ్రహావేశాలు శ్రీఅక్కల్కోట్ మహారాజ్‌లో తరచుగా కనిపించేదని నేను విన్నాను. ఇంకా తర్వాత ఎవరో నాతో ఇలా కూడా అన్నారు, 'హారతి అనంతరం అక్కల్‌కోట్కర్ మహారాజ్ మహారాజ్(సాయిబాబా) శరీరాన్ని ఆవహించినందున అలా జరుగుతుందని, మరియు పాపాలు వంటి అదృశ్య కారణాలు ఉండవచ్చని'. కానీ అది విని నాకు అంతగా సంతృప్తి కలగలేదు. ఒక సత్పురుషుని విషయంలో ఎల్లప్పుడూ సాత్విక గుణాలు కనిపిస్తున్నప్పుడు, ఉన్నట్టుండి ఆగ్రహావేశాలు వంటి తామసిక గుణం ఎందుకు ఉద్భవిస్తుందో అంతుచిక్కని రహస్యం. తత్వశాస్త్రవేత్తలే  దీని గురించి ఆలోచించాలి.


మహారాజ్ విషయంలో కనిపించే ఇతరుల మనసును తెలుసుకోవడం, భూత, భవిష్యత్తుల గురించిన జ్ఞానం, ఇంకా అలాంటి ఇతర అద్భుతాలు కేవలం యోగ సిద్ధ పురుషునికి మాత్రమే ప్రాప్తిస్తాయి. పతంజలి యోగశాస్త్రంలో ఇటువంటి అనేక విషయాలు ప్రస్తావించబడ్డాయి. దీనిని బట్టి శ్రీసాయిబాబా ఒక గొప్ప యోగి సత్పురుషులై ఉండాలనే స్పష్టమైన అవగాహనకు నేను వచ్చాను. భావికభక్తులు ఆయనను ప్రత్యక్ష దైవమన్న దృష్టితో చూడటం కూడా యోగ్యమైనదే(సరైనదే). ఎందుకంటే, యోగ సాధన ద్వారా దైవత్వాన్ని(భగవత్ స్వరూపాన్ని) పొందినవారు దైవం కాక మరేమిటి? అటువంటి సత్పురుషుల వద్దకి కపటం లేకుండా వెళ్లినా, చికిత్స నిమిత్తం వెళ్లినా ఆ సత్పురుషుల సాత్విక గుణాల ప్రభావం వల్ల వారు కూడా సాత్వికులు కావడం సహజం.


సోర్స్: సాయిలీల పత్రిక 1938, 4,5, 6 సంచిక & 1938, 7,8,9 సంచిక


3 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo