సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 2038వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • శ్రీసాయి అద్భుత లీల

ప్రియమైన శ్రీసాయి భగవత్ బంధువులందరికీ నా నమస్కారాలు. నా పేరు రాజేశ్వరి. నేను హైదరాబాద్‌లో ఉంటాను. నా జీవితంలో బాబా లీలలు కోకొల్లలు. నా జీవితమంతా శ్రీసాయిబాబా కృప, కానుక అని నేను నిస్సందేహంగా చెప్పగలను. నాకు ఎంతటి సమస్య వచ్చినా సాయి అనుక్షణం నా వెంటే ఉండి, ఆ సమస్య తీరేదాకా నాకు ఓర్పు, సహనాలను అనుగ్రహించి ఆ సమస్య నుండి బయటపడే సమయం రాగానే ఎంతో అవలీలగా నన్ను బయటపడేస్తారు. నాకు ఇద్దరు అబ్బాయిలు. వాళ్ళిద్దరూ బాబా పైసలు. ఈ విషయం స్వయంగా బాబానే చెప్పారు. బాబా అనుగ్రహంతో పెద్దబ్బాయి ఎంబీబీఎస్ పూర్తిచేసి వచ్చే సంవత్సరం పీజీ సీటు కోసం తయారవుతున్నాడు. చిన్నబ్బాయి ఈ సంవత్సరం ఎంబీబీస్‌లో చేరాడు. ఇద్దరు బిడ్డలు మెడికల్ ప్రొఫెషన్‌లో చేరడం, చదవటం అంతా బాబాచే ముందుగా నిర్ణయించబడి వుంది. ఆ విషయం బాబానే స్వయంగా మా చిన్నబ్బాయికి స్వప్నంలో కనిపించి చెప్పారు. నేనిప్పుడు మా చిన్నబ్బాయి మెడిసిన్ సీటు విషయంలో బాబా అద్భుత లీలను వివరించబోతున్నాను.

మేము మా చిన్నబ్బాయిని ఇంటర్ చదువుకోసం చైతన్యలో చేర్పించాము. వాడు అక్కడ ఒత్తిడి తట్టుకోలేకపోవడం వల్ల తన ఆరోగ్యం పాడయ్యింది. ఇంటర్ చదివే రెండు సంవత్సరాలూ తనని చాలా ఇబ్బందిపెట్టింది. ఎంతలా అంటే నెలలు తరబడి కాలేజీకి వెళ్ళలేకపోయాడు. ఎప్పుడూ అనారోగ్యంతో ఉండేవాడు. అన్ని హాస్పిటల్స్‌కు తిప్పి, అన్ని రకాల టెస్టులు చేయించాము. డాక్టర్లు "సమస్యేమీ లేదు. అంతా బాగుంది. అబ్బాయి విపరీతమైన టెన్షన్ పడుతున్నాడు. దానివల్లే ఆరోగ్యం దెబ్బతింటుంది" అని చెప్పారు. మా అబ్బాయి అంత ఇబ్బందిపడటం చూసి నాకు నరకం కనిపించేది. ఆఖరికి మా అబ్బాయి ఇంటర్ మొదటి సంవత్సరం సగం అయిన తర్వాత నేను, "నువ్వు ఈ సంవత్సరం పరీక్షలు వ్రాయొద్దు. వచ్చే సంవత్సరం తాజాగా ఎంపీసీ తీసుకో! ప్రశాంతంగా చదువుకోవచ్చు. ఆపై ఐఐటీలో ఏమీ వద్దు. మంచి కాలేజీలో బీటెక్ చదువుదువు. నేను నీ బాధ చూడలేకపోతున్నాను" అని ఖరాఖండిగా చదువు మానేయమని చెప్పాను. కానీ మా అబ్బాయి "మెడిసిన్ చదవడం నా కల. కానీ టెన్షన్‌ని, భయాన్ని తగ్గించుకోలేకపోతున్నాను. అలాగని నేను ఇప్పుడు మధ్యలో మానేసి వేరే గ్రూపుకు మారను" అని అన్నాడు. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. మావారు, పెద్దబ్బాయి నన్ను స్థిమితపరిచి, "వాడికి ఇష్టం లేని పని బలవంతంగా చేయమని చెప్పొద్దు. కాలేజీకి వెళ్లే ఓపిక ఉన్న రోజు కాలేజీకి వెళ్తాడు. మిగతా సమయం అంతా ట్యూషన్స్ పెట్టిద్దామ"ని చెప్పారు. అలా రెండు సంవత్సరాలు కొనసాగించాం. తప్పక అలా చేసాము కానీ, ఆ విధంగా చదివి నీట్ ఎగ్జామ్ వ్రాసి, మెడిసిన్ సీటు తెచ్చుకోవడం అనేది నా దృష్టిలో అసాధ్యమనే చెప్తాను.

2025, మే 4న అబ్బాయి నీట్ పరీక్ష వ్రాసాడు. పేపర్ ఇంతకుముందెన్నడూ ఇవ్వనంత కఠినంగా వచ్చింది. మా అబ్బాయి వ్రాసిన విధానానికి, వచ్చిన మార్కులకి కేవలం బాబా దయవల్ల మెడిసిన్ సీటు రావాలి. ఒకవేళ బాబా అనుగ్రహించినా మేము కోరుకునే మూడు ప్రధాన కాలేజీలలో సీటు రాదు. ఆ విషయం  అర్థమైనా కౌన్సిలింగ్ మొదలుపెట్టాక మా అబ్బాయికి బాగా ఇష్టమైన ఆ మూడు కాలేజీలతోపాటు మిగతా కాలేజీలు పెడుతుండేవాళ్ళము. అది కూడా అన్ని కాలేజీలు కాదు. మా ఇంటినుంచి రోజూ వెళ్ళొచ్చేలా దగ్గర్లో ఉన్న కాలేజీలు మాత్రమే పెట్టేవాళ్ళము. మావాడు ఇంటర్ చదివిన తీరుకి ఫ్రీ సీటు వస్తుందని మేము అనుకోలేదు. అలాంటిది బాబా దయవల్ల మొదటి రౌండ్లో వాడికి ఫ్రీ సీటు వచ్చింది. మేము చాలా సంతోషపడ్డాం. మా అబ్బాయి కూడా సంతోషించినప్పటికీ అనుకున్న కాలేజీ రాలేదని మనసులో పెట్టుకున్నాడు. రెండవ రౌండ్ కౌన్సిలింగ్‌లో వాడికి ఇష్టమైన కాలేజీలలో సీటు వస్తుందేమోనని ఆశ పెట్టాము కానీ, రాలేదు. ఆఖరికి ఆ కాలేజీలలో సీటు మా అబ్బాయికొచ్చే అవకాశం దరిదాపుల్లో కూడా లేదని రూఢి అయ్యాక వాస్తవికత మా అబ్బాయికి చెప్పి, 'ఆ కాలేజీల మీద ఆశ పెట్టుకోవద్దని. వచ్చిన సీటు బాబా అనుగ్రహంగా భావించి చదువు కొనసాగించమని' చెప్పాము.

2025, అక్టోబర్ నెలాఖరులో కాలేజీ మొదలైంది. మేము సంతోషంగా మా అబ్బాయిని కాలేజీలో దింపాము. అయితే సాయంత్రం ఇంటికి వచ్చిన మా అబ్బాయి పెద్ద బాంబు పేల్చాడు. ఆ కాలేజీలో సీనియర్స్ వీళ్ళతో(జూనియర్స్) "ఈ కాలేజీ అస్సలు బాగోదు. ఇక్కడ చదవడం పెద్ద దండగ. లెక్చరర్లు క్లాసులోకి రారు. వచ్చినా ఏం చెప్పరు. బాగా చదివినవాళ్ళని కావాలని ఫెయిల్ చేస్తార"ని ఇష్టం వచ్చినట్లు చెప్పారంట. మా అబ్బాయి వాళ్ళ మాటలు బాగా బుర్రకు ఎక్కించుకొని భయపడిపోయి, "నేను ఈ కాలేజీలో చదవలేను. ఇలా ఉంటే నాకు నాకు కష్టం కదా!" అని అన్నాడు. అదే మెడిసిన్ ఫీల్డ్‌లో ఉన్న మా పెద్దబ్బాయి "నేనున్నాను కదా! ఎలా చదవాలో నేను చెప్తాను కదా! నాది మెడిసిన్ అయిపోయింది. నీ సీనియర్లది ఇంకా అవ్వలేదు. నా మాట విను. వాళ్ళని ఏం పట్టించుకోకు. ఈ రోజుల్లో మెడిసిన్ సీట్లు దొరకటం అంటే మామూలు విషయం కాదు. అతిగా ఆలోచించుకు" అని ఎన్ని విధాలా చెప్పినా, నేను, మావారు కూడా ఎంత చెప్పినా వినకుండా ఒక రకమైన భయం పెట్టేసుకొని తినటం బాగా తగ్గించేసి ఆరోగ్యం పాడుచేసుకోవడం మొదలుపెట్టాడు. మాకు ఏం చేయాలో తెలియలేదు. అలా నరకం కొనసాగుతుండగా ఒక పది రోజుల తర్వాత మూడో కౌన్సిలింగ్ డేట్ ఇచ్చారు. మా చిన్నబ్బాయి, "ఏ కాలేజీ అయినా పెట్టండి. సీటు వస్తే వెళ్ళిపోతాను. ఈ కాలేజీలో మాత్రం నేను చదవలేను" అని తేల్చేశాడు. అంటే ఆ కౌన్సిలింగ్‌లో మేము ఇంకా కింద స్థాయి కాలేజీలు పెట్టాలి. అయినా చేసేదేమీలేక మొదట రావనుకున్న మూడు కాలేజీలతోపాటు మిగతా కింద స్థాయిలో ఉన్న మరొ మూడు కాలేజీలు పెట్టాము. తర్వాత నేను, "బాబా! మీరే మాకు దిక్కు. వాడికి మేము ఏమీ చెప్పలేకపోతున్నాం. మెడిసిన్ సీటు వచ్చిందనే సంతోషమే లేకపోగా వీడి భవిష్యత్తు ఏమైపోతుందో అని విపరీతమైన భయమేస్తుంది" అని బాబా ముందు విపరీతంగా ఏడ్చి, "బాబా! నన్ను ఎన్నో సమస్యల నుండే మీరే బయటపడేశారు. పిల్లలిద్దరూ మెడిసిన్ ప్రొఫెషనల్‌లో ఉంటారని మీరే స్వయంగా చెప్పారు. ఇప్పుడు వీడు ఆ కాలేజీకి వెళ్లలేను అంటున్నాడు. ఈ చివరి కౌన్సిలింగ్‌లో వాడికి నచ్చిన కాలేజీలో వాడికి వచ్చిన ర్యాంకు ఆధారంగా ఎట్టి పరిస్థితుల్లోనూ సీటు రాదు. దిగువ స్థాయి కాలేజీల్లో సీటు వచ్చినా ఆ కాలేజీకి వెళ్ళాక ఏమంటాడో? నాకు ఏమీ అర్థం కావడం లేదు. ఇక మీరే దిక్కు. వాడి ఆలోచన మార్చండి. వాడి భయాన్ని మీరే తీసేయండి. వాడికి స్థిరత్వాన్ని ఇవ్వండి. వాడికి ఏది మంచని మీరు అనుకుంటున్నారో అది చేయండి" అని పదేపదే శ్రీసాయిని ప్రార్థించడం మొదలుపెట్టాను. నాతోపాటు మావారు కూడా బాబాను ప్రార్థించసాగారు. భగవత్ భక్తులారా! పూర్తి నిస్సహాయస్థితిలో శ్రీసాయి మీదే మొత్తం భారమేసి తీవ్రంగా ప్రార్థించే ప్రార్థనలను శ్రీసాయి క్షణం మాత్రం కూడా ఆశ్రద్ధ చేయరు. ఆశ లేదు, మునిగిపోతున్నామన్న సందర్భంలో 'సాయీ! నీవే దిక్కు' అని మనస్ఫూర్తిగా వేడుకున్న ప్రతిసారీ ఆయన, 'ఓయ్, ఇదిగో పక్కనే ఉన్న' అన్నట్టు పరిస్థితిని సవ్యంగా మలుస్తారు. ఇది నేను చవిచూసిన పరమసత్యం. శ్రీసాయి ఎంతటి అద్భుతం చూపారో చూడండి! శ్రీసాయి మా అబ్బాయి కోరికను మన్నించి, వాడు అత్యంత ఇష్టపడే కాలేజీలలో, అది కూడా అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ సీటు రాదనుకున్న మొదటి కాలేజీలో వాడికి సీటు అనుగ్రహించారు. అసాధ్యమనుకున్నది సాధ్యం చేసి తమ లీలలు  అనంతం, అమోఘం అని నిరూపించారు. ఇది ముమ్మాటికి శ్రీసాయి అద్భుతమైన లీల. మా జీవిత ప్రయాణంలో శ్రీసాయి మాకిచ్చిన మరొక వరం. "అన్నిటికీ చాలా చాలా ధన్యవాదాలు బాబా".

9 comments:

  1. ఓమ్ శ్రీ సాయినాథాయ నమో నమః 🙏🏻
    🕉️🌹🙏🏻🙏🏻🙏🏻🌹🔯

    ReplyDelete
  2. ఓం సాయిరామ్

    ReplyDelete
  3. Om sri sairam🙏🙏

    ReplyDelete
  4. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Ram.

    ReplyDelete
  5. Omsrisaiasahayasahayanamaha

    ReplyDelete
  6. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  7. ఓం సాయి నాధాయనమః 🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo