ఈ భాగంలో అనుభవం:
- శ్రీసాయి అనురాగ తరంగాలు
అనేకమంది భాగ్యశాలురైన సాయిబాబా భక్తులలో నేనూ ఒక భక్తుడిని. నా పేరు రవి. నా జీవితంలో బాబా లీలలను చవి చూసిన అనేక సందర్భాలున్నాయి. వాటిలో కొన్ని తోటి సాయిబంధువులతో పంచుకుంటున్నాను. 2008లో ఒకరోజు సాయంత్రం నేను నా ఆఫీస్ నుండి ఇంటికి బైక్ మీద బయలుదేరాను. సాధారణంగా రోజూ ఏదో ఒక వాహనం వెనుక బాబా ఫోటో రూపంలో దర్శనమిస్తుంటారు. కానీ, ఆ రోజు ఉదయం నుండి బాబా నా కంటపడలేదు. అందువల్ల నేను నా మనసులో, “బాబా! ఇంకొన్ని అడుగుల దూరం వెళితే, నేను ఎడమవైపు తిరిగి మా ఇంటికి వెళ్ళిపోతాను. ఆ మలుపు తిరిగే లోపల నేను నిన్ను చూడాలి” అని అనుకున్నాను. బాబా నా ప్రార్థన విన్నారు. సరిగా నేను ఎడమవైపు మలుపు తిరిగే చోట పార్క్ చేసి ఉన్న ఒక కారు వెనుక బాబా చిరునవ్వుతో ఉన్న ఫోటో కనిపించింది. అది సాయిబాబాతో నా మొదటి అనుభవం. ఇప్పటికీ అది నా మదిలో స్పష్టంగా నిలిచిపోయింది.
2013లో ఒకరోజు మధ్యరాత్రిలో నాకు తీవ్రమైన కడుపునొప్పి మొదలైంది. నేను మంచం మీద నుండి లేచి గదిలో నడుస్తూ బాబాను ప్రార్థించడం ప్రారంభించాను. నా భార్య బాబా ఊదీ తెచ్చి, నాకు నొప్పి ఉన్న భాగంలో రాసింది. అద్భుతం! ఆమె చేయి తీయగానే నొప్పి పూర్తిగా మాయమైంది. నేను అస్సలు నమ్మలేకపోయాను. ఎందుకంటే, ఇలాంటి అనుభవాలు పుస్తకాలలో మాత్రమే చదివాను. స్వయంగా అనుభవించడం అదే మొదటిసారి.
నేను, నా తమ్ముడు అమెరికాలో వేర్వేరు నగరాల్లో ఉంటున్నాము. నా తమ్ముడు, తన కుటుంబం గొప్ప సాయిభక్తులు. వాళ్ళింట్లో పెద్ద బాబా ఫోటో గోడకు ఉండేది. వాళ్ళు కొత్త ఇంటికి మారినప్పుడు కొత్తింట్లో ఆ ఫోటో పెట్టడానికి సౌకర్యం లేక దాన్ని అలాగే ప్యాక్ చేసి ఉంచారు. ఇలా ఉండగా నేను ఒక పెద్ద సాయిబాబా ఫోటో ఆర్డర్ చేసి, మా ఇంటి ప్రవేశద్వారం వద్ద పెట్టాను. తర్వాత ఒక ఉదయం నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో నేను ఫోన్లో ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాను. అతను డెలివరీ బాయ్‌లా ఉన్నాడు. అతను నా తమ్ముడి కొత్త చిరునామా అడిగాడు. నేను అతనికి దారి చెప్తుండగా అతను హిందీలో మాట్లాడడం ప్రారంభించి, “మీరు ఎక్కడివారు?” అని అడిగాడు. నేను నా ఊరి పేరు చెప్పి, “మీరు ఎక్కడివారు?” అని అడిగాను. అందుకతను 'శిరిడీ' అని చెప్పాడు. ఆ వెంటనే నాకు ద్వారకామాయి మరియు సాయిబాబా దర్శనమిచ్చారు. నేను నిద్రలేవగానే 'బాబా ఏదైనా సందేశమిస్తున్నారేమో!' అనుకున్నాను కానీ, అది ఏమిటో నాకు అర్థం కాలేదు. కొన్ని రోజుల తర్వాత నా తమ్ముడు, “నువ్వు మీ ఇంట్లోని బాబా ఫోటో ఎక్కడ ఆర్డర్ చేశావు? నేనూ ఒకటి ఆర్డర్ చేయాలనుకుంటున్నాను” అని అన్నాడు. అప్పుడు నాకు, 'బాబా నా తమ్ముడి ఇంటికి వస్తున్నానని ఆ కల ద్వారా సూచించార'ని అర్థమైంది.
నాకు పెళ్ళై పదేళ్లు దాటినా పిల్లలు కలగలేదు. ఎన్నో వైద్యపరీక్షలు, చికిత్సలు అయిన తర్వాత కూడా ప్రయోజనం లేకపోయింది. చివరకి మేము ఆశలు వదిలేసుకున్నాము. తర్వాత 2019లో దురదృష్టవశాత్తు నా తండ్రి అనారోగ్యంతో మరణించారు. అదే నెలలో నా భార్య గర్భవతి అయింది. ఇది నిజంగా అద్భుతం. మా కుటుంబంలోని అందరూ అబ్బాయే పుడతాడని, నా తండ్రి తిరిగి వస్తున్నారని భావించారు. ఇక్కడ అమెరికాలో బిడ్డ లింగ నిర్ధారణ ముందుగా తెలుసుకొనే వెసులుబాటు ఉన్నప్పటికీ మేము తెలుసుకోకూడదని నిర్ణయించుకున్నాం. నా భార్య మూడు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు తనకి ఒక కల వచ్చింది. ఆ కలలో ఆమె మసీదులో సాయిబాబాతో కూర్చొని ఉండగా బాబా ఆమెతో, “నీ ఆరోగ్యం గురించి ఆందోళనపడకు. ఒక అందమైన, ఆరోగ్యవంతమైన పాప వస్తోంది” అని అన్నారు. బాబా చెప్పినట్లే తొమ్మిది నెలలు నిండాక నా భార్య ఒక అందమైన ఆడపిల్లకి జన్మనిచ్చింది.
మా పాపకి ఐదేళ్ల వయసప్పుడు వినాయకచవితి తర్వాత గణేష్ నవరాత్రుల సమయంలో ఒకరోజు సాయంత్రం మేము గుడికి వెళ్ళాము. మా పాప గుడి లోపలకి వెళ్తున్నప్పుడు, “నాకు బాబా పింక్ డ్రెస్‌లో కనిపించాలి” అని అంది. బాబా ఆమె కోరికను తీర్చారు. బాబా పింక్ రంగు దుస్తుల్లోనే దర్శనమిచ్చారు. నా కూతురు బాబాను పింక్ రంగు వస్త్రాల్లో చూసి ఎంతో ఆనందోత్సాహాలతో పులకరించిపోయింది.
ఒకరోజు రాత్రి అంటే ఇండియాలో తెల్లవారుజామున కాకడ ఆరతి జరిగే సమయంలో నేను నా భార్యను, "ఈరోజు సాయిబాబాకు ఏ రంగు దుస్తులు కావాలి?" అని అడిగాను. ఆమె నీలం అంది. అప్పుడు నేను బాబాతో, “బాబా! ఈరోజు మేము నిన్ను నీలం రంగు దుస్తుల్లో చూడాలనుకుంటున్నాం” అన్నాను. ఆ తరువాత నాకు వచ్చిన కాకాడ ఆరతి ఫోటోలలో చూస్తే, బాబా నీలం రంగు దుస్తుల్లో లేరు. కానీ నేను నిద్రపోయాక కలలో బాబా నీలం రంగు శాలువతో దర్శనమిచ్చారు. ఉదయం నిద్ర లేవగానే శిరిడీ వెబ్సైట్ చూస్తే, బాబా నీలం రంగు దుస్తుల్లో ఉన్న ఫోటో నా కంటపడింది.
ఇలా ఇప్పటివరకు నేను నా జీవితంలో అనుభూతి చెందిన ప్రతి అనుభవం నన్ను బాబాకు మరింత దగ్గర చేస్తూ వచ్చాయి. మా జీవితంలో ప్రతి అడుగున బాబా మా వెన్నంటే ఉండి మార్గ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనకు ఎంత కృతజ్ఞతలు తెలిపినా తక్కువే. కానీ బాబా తమ భక్తుల నుండి అది ఎన్నడూ ఆశించరు. ఆయన మన నుండి కోరేది ప్రేమ, విశ్వాసాలను మాత్రమే. శ్రీసాయిసచ్చరిత్రలో చెప్పినట్లు 'ఎవరైనా మనను వదిలివేయవచ్చు కానీ, సాయిబాబా ఎన్నడూ మనను వదిలిపెట్టరు'. ఆయనపై విశ్వాసం ఉంచి, ఆయనను పిలవండి – ఆయన మీ పక్కనే నిలబడి ఉంటారు.

Om Sai Rakshak Saranam Devaa 🙏🙏🙏
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me