ఈ భాగంలో అనుభవాలు:
- బాబా ఆశీస్సులు
బాబా ఆశీస్సులు
నా పేరు మాధవి. ఒకరోజు మా కుటుంబమంతా సినిమాకి వెళ్ళాము. నేను నా పక్క సీటులో మా ఆరేళ్ళ బాబుని కూర్చోబెట్టుకున్నాను. మా ఇద్దరి సీట్ల మధ్యనున్న కప్ హోల్డర్‌లో నా ఫోన్ పెట్టాను. సినిమా మధ్యలో మా బాబు కాళ్లు ముందు సీటులో ఉన్న వాళ్ళకి తగులుతుందేమోనని వాడి కాళ్ళు వెనక్కి లాగే ప్రయత్నంలో నా చేయి ఫోన్‌కి తగిలి అది కింద పడిపోయింది. నేను వెంటనే నా సీటు కింద వెతికాను కానీ, మొబైల్ కనిపించలేదు. మావారు ఫోన్ చేస్తే, రింగ్ అవుతుంది కానీ, సినిమా శబ్దాలకి రింగ్ వినపడలేదు. నాకు కాస్త భయమేసింది. ఎందుకంటే, నా క్రెడిట్ కార్డులు ఆ ఫోన్ వెనక ఉన్నాయి. అందువల్ల, "ఫోన్ దొరికెలా చూడండి బాబా" అని బాబాని ప్రార్థించాను. మావారు "ఇంటర్వెల్లో చూద్దాము. ఇప్పుడు చుట్టూ ఉన్నవాళ్ళని డిస్టర్బ్ చేస్తే బాగోదు" అని అన్నారు. నేను సరేనన్నాను. తర్వాత ఇంటర్వెల్లో వెతికితే, బాబా దయవల్ల ఫోన్ నా ముందు సీటు కింద దొరికింది. "ధన్యవాదాలు బాబా. ఫోన్ దొరక్కపోయుంటే చాలా కష్టమయ్యేది. చాలా చాలా ధన్యవాదాలు బాబా".
ఒకసారి మా అమ్మానాన్న ముందుగా ఏమీ బుక్ చేసుకోకుండా తిరుమల వెళదామనుకున్నారు. నేను అలా వెళ్లోద్దని చెప్తున్నా వినకుండా వాళ్ళు బయలుదేరారు. నేను ఇక చేసేదేమీలేక ఊరుకొని, "బాబా! అమ్మానాన్న ఎక్కడా ఇబ్బందిపడకుండా చూడండి. అసలే వాళ్ళు వయసులో కాస్త పెద్దవాళ్ళు. వాళ్ళు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా చూడండి" అని బాబాని వేడుకున్నాను. బాబా దయవల్ల వాళ్ళకి తెల్లవారుజామున 3 గంటల దర్శనానికి టోకెన్లు దొరికాయి. సరేనని వాళ్ళు కొండపైకి వెళ్లారు. అక్కడ 'వసతి గదులు అయిపోయాయి, లేవని' చెప్పారు. నేను, 'వాళ్ళు రాత్రంతా ఎలా ఉంటారో? సరైన నిద్రలేకపోతే షుగర్, బీపీ ఉన్న నాన్న ఇబ్బందిపడతారు' అని చాలా బాధపడ్డాను. కానీ ఏమి చేయలేకపోయాను. కానీ ఆ బాబా దయవల్ల వాళ్ళు బాగానే ఉన్నారు, 2 గంటలలో గోవిందుని దర్శనమైంది. తర్వాత వాళ్ళ తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యారు. కానీ వాళ్ళు ట్రైన్ టిక్కెట్లు బుక్ చేసుకోలేదు. వాళ్ళకి బుక్ చేసుకొవడం సరిగా రాదు. సరేనని నేను బుక్ చేయాలని చూస్తే, వెయిటింగ్ లిస్టు చూపించాయి. అవే బుక్ చేసానుగాని ఆరోజంతా, "బాబా! మీ దయవల్ల టిక్కెట్లు కన్ఫర్మ్ అవ్వాలి. కనీసం వాళ్ళు ట్రైన్‌లోనైనా కాసేపు నడుము వాల్చి నిద్రపోతారు. లేకపోతే వాళ్ళు చాలా ఇబ్బందిపడతారు" అని బాబాకి దణ్ణం పెట్టుకున్నాను. బాబా దయవల్ల వాళ్ళిద్దరికీ టిక్కెట్లు కన్ఫర్మ్ అయ్యాయి. "కోటి కోటి ప్రణామములు తండ్రీ. నా ప్రార్థనలు విన్నందుకు ధన్యవాదాలు బాబా".
2025, సెప్టెంబర్ 30న నేను మా అమ్మకోసం పాస్‌పోర్ట్ అపాయింట్మెంట్ బుక్ చేసాను. దానికోసం అమ్మ వేరే ఊరు వెళ్లాల్సి ఉండగా 4 రోజుల ముందు నాన్నకి బాగా జ్వరమొచ్చింది. నేను బాబాకి, "నాన్నకి జ్వరం తగ్గిపోవాల"ని దణ్ణం పెట్టుకున్నాను. బాబా దయవల్ల నాన్నకి జ్వరం తగ్గింది. కానీ అమ్మకి చాలా జ్వరం వచ్చింది. 'అయ్యో బాబా! అమ్మ ఈ స్థితిలో వెళ్లగలదా?' అని అనుకున్నాను. అప్పోయింట్మెంట్ వాయిదా వేద్దామంటే మళ్ళీ అంత త్వరగా అపాయింట్మెంట్ దొరకదు. అందుకని బాబాకి దణ్ణం పెట్టుకొని, "బాబా! అమ్మ కోలుకోవాలి. రేపు ప్రయాణం చేయగలిగే ఓపిక తనకి మీరే ఇవ్వండి బాబా" అని వేడుకున్నాను. బాబా దయవల్ల మర్నాడు ఉదయానికల్లా అమ్మ ఆరోగ్యం కుదుటపడింది. "చాలా ధన్యవాదాలు బాబా. మీరు ఎప్పుడూ ఇలాగే మాకు తోడుగా ఉండాలి బాబా. అలాగే మీ ఆశీస్సులు అందరికీ ఎల్లవేళలా ఉండాలి తండ్రీ. శిరిడీ దర్శించే భాగ్యాన్ని నాకు ప్రసాదించండి బాబా. మీ పాదసేవాభాగ్యాన్ని కూడా కోరుకుంటున్నాను బాబా".
మా మావయ్యకి బాగలేకపోతే మా అమ్మ చూడటానికి వేరే ఊరు వెళ్ళింది. అక్కడ హాస్పిటల్లో ఉండి మావయ్యని చూసుకోవాల్సి వచ్చి ఆ రాత్రంతా అమ్మ సరిగ్గా నిద్రపోలేదు. అమ్మ రెండు రోజులు అక్కడే ఉండి ఇంటికి తిరిగి వచ్చింది. అమ్మకి నీళ్ళు మారితే చాలు జలుబు, దగ్గు వచ్చేస్తాయి. అందువల్ల అమ్మ బాగా దగ్గుతో బాధపడింది. ఎంతలా అంటే దాదాపు రాత్రి 2, 3 వరకు దగ్గుతూ సరిగా నిద్రపోలేదు. నాకు చాలా బాధగా అనిపించి ఏమీ తోచలేదు. అటువంటి స్థితిలో సాయినాథుడే నాకు దిక్కు. కాబట్టి, "బాబా! రేపటికల్లా అమ్మకి కాస్త నయమై సరిగా నిద్రపోవాలి" అని బాబాను ప్రార్థించాను. బాబా నా ప్రార్థన విన్నారు. మరుసటిరోజు నుండి అమ్మకి కాస్త తగ్గుతూ వచ్చి గురువారం కల్లా ప్రశాంతంగా నిద్రపోయింది. "చాలా ధన్యవాదాలు బాబా. నేను ఎప్పుడూ మీకు దగ్గరలో ఉండేలా చూడండి బాబా. నేను ఏమి అడుగుతున్నానో మీకు తెలుసు. దయచేసి సదా నాతో ఉండండి బాబా. నేను ఎప్పుడూ మీ నామస్మరణలో మునిగిపోవాలి. మునుపు ఎలా మీ స్మరణలో ఆనందంగా గడిపానో అలానే మీ మీద నేను దృష్టి నిలపాలి బాబా. నన్ను ఆశీర్వదించండి బాబా".

Om Sairam
ReplyDeleteSai always be with me
Om Sai Ram ❤️❤️❤️🙏🙏🙏
ReplyDeleteOmsairam🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
ReplyDelete