- శ్రీసాయి అనుగ్రహ లీలలు - 35వ భాగం
నా పేరు సాయిబాబు. బాబా మా కుటుంబాన్ని శిరిడీలో తన పాదాల చెంతక ఎలా చేర్చారో చదవండి. ఆగస్టు 18 మా అమ్మాయి పెళ్లిరోజు. ఆ సందర్భంగా 2024లో తను తన కుటుంబంతో బాబా ఆశీస్సుల కోసం ముందురోజు బయలుదేరి శిరిడీ వెళ్ళింది. తను బాబా దర్శనం చేసుకుని బాబాని బహుమతి అడిగింది. బాబా బహుమతి ఇచ్చారు. అదేమిటంటే, శిరిడీలో నివాస స్థలం. మా అమ్మాయివాళ్ళు మొబైల్‌లో ఏదో వెతుకుతూ ఉంటే ప్లాట్లకి సంబంధించిన ఒక యాడ్ కనిపించింది. అక్కడున్న ఫోన్ నెంబర్‌కి కాల్ చేసి వివరాలు అడిగితే, "కేవలం 2 ప్లాట్లు ఉన్నాయి" అన్నారు. సరేనని వెళ్లి చూసి, ఆ ప్లాట్ తీసుకోవాలా, వద్దా అని ద్వారకమాయిలో చీటీలు వేసి, అక్కడున్న పూజారి చేత తీయిస్తే, తీసుకోమని బాబా సమాధానం వచ్చింది. దాంతో మర్నాడు అడ్వాన్స్ డబ్బులు కట్టి అగ్రిమెంట్ రాసుకున్నారు. తర్వాత రిజిస్ట్రేషన్ కూడా పూర్తైంది. శిరిడీలో అడుగు పెట్టడమే మహాభాగ్యం అనుకుంటే, బాబా ఏకంగా ప్లాట్ ఇప్పించి తమ చరణాల వద్ద శాశ్వతంగా ఉండడానికి మాకు అవకాశం ఇచ్చారు. ఇకపోతే, మా అమ్మాయి శిరిడీలో ఉండగా వరలక్ష్మీ వ్రతం చేసే రోజు వచ్చింది. తను బెంగళూరులో శ్రావణమాసం వరలక్ష్మి వ్రతం అమ్మవారి ప్రతిమ పెట్టి పూజ బాగా చేస్తుంది. కానీ అప్పుడు శిరిడీలో ఉన్నందున వరలక్ష్మి పూజ చేసే అవకాశం లేదు. కానీ ఆ లోటును బాబా ఎలా తీర్చారో చూడండి. ఆరోజు సాయి సత్యవ్రతానికి మా అమ్మాయివాళ్ళు వెళితే, ముందుగా అష్టలక్ష్మి వ్రతం చేయించి తర్వాత సాయి సత్యవ్రతం చేయించారు పూజారి.
బాబా మనసులోని మాట గ్రహించి అది నెరవేరుస్తారు. 2024లో నేను బెంగళూరులోని మా అమ్మాయి వాళ్ళింటిలో ఉన్నాను. అప్పుడు డిసెంబర్ నెలలో శిరిడీ వెళ్దామని బస్సు టికెట్లు బుక్ చేసుకున్నాము. నాకు అయ్యప్పస్వామి ప్రసాదం అంటే ఇష్టం. ఆంధ్రాలో ఉంటే ప్రతి సంవత్సరం ఎవరో ఒకరు అయ్యప్ప ప్రసాదం తెచ్చి నాకు ఇస్తుంటారు. కానీ ఆ సంవత్సరం నేను బెంగళూరులో ఉన్నందున అయ్యప్ప ప్రసాదం లభించలేదు. మా అమ్మాయివాళ్ళకి పాలు పోసే అతను అయ్యప్ప మాల వేసుకున్నప్పటికీ నేను అతన్ని ప్రసాదం కావాలని అడగలేకపోయాను. అయినా నా మనసులోని కోరికను బాబా గ్రహించారు. మా శిరిడీ ప్రయాణానికి ముందురోజు మేము అడగకుండానే తెలిసినవాళ్లు అయ్యప్పస్వామి ప్రసాదం తెచ్చి ఇచ్చారు. నాకు చాలా సంతోషమేసింది. మేము శిరిడీకి వెళ్లొచ్చిన తర్వాత ఆ ప్రసాదం తీసుకుందామని సీల్ ఓపెన్ చేయకుండా బాబా దగ్గర పెట్టి, ఇంటికి తాళాలు వేసి శిరిడీ వెళ్ళాము. అక్కడ బాబా ఇచ్చిన ప్లాట్ చూసి 4 రోజుల తర్వాత తిరిగి వచ్చాము. మేము తలుపు తెరవగానే బాబా దగ్గరున్న అయ్యప్ప ప్రసాదం సీల్ ఓపెన్ చేసి మూత పక్కన పెట్టి ఉండటం చూసి ఆశ్చర్యపోయాము. తలుపులు, కిటికీలు మొత్తం అన్నీ మూసి ఉన్నందున బాబానే మూత తీసి ప్రసాదం స్వీకరించారని ఆనందించాము. అదీ బాబా లీల.
2024, డిసెంబర్‌లోనే ఒకరోజు మా అమ్మాయికి బాబా "మీరు శిరిడీకి రండి. అన్నీ నేను చూసుకుంటాను" అని దివ్యప్రేరణనిచ్చారు(సిక్స్త్ సెన్స్). అప్పుడు ఎప్పుడు రమ్మంటారని చీటీలు వేసి బాబాని అడిగితే, '2025లో రండి' అని చెప్పారు. మేము ఎప్పుడు వెళ్లాలో కూడా బాబానే చెప్తారని అనుకున్నాము. తర్వాత 2025, మార్చిలో శిరిడీలో ఉన్న స్నేహితుల ద్వారా అద్దెకు ఇల్లు వెతికించాము కానీ, దొరకలేదు. 2025, ఏప్రిల్ 5న మా అమ్మాయి పుట్టినరోజు. ఆ సందర్భంగా మా అమ్మాయి, అల్లుడు శిరిడీ వెళ్లారు. బాబా దయవల్ల అదేరోజు కొత్త ఇల్లు అద్దెకు దొరికింది. మా అమ్మాయి బాబా దర్శనం చేసుకొని, వారి ఆశీస్సులు తీసుకొని 'పుట్టినరోజు కానుక ఇమ్మని' అడిగింది. బాబా బహు విలువైన బహుమతి ఇచ్చారు. అదేమిటంటే, ఫేస్బుక్ ద్వారా 'మీరు ఈ నెల చివరిరోజున బయలుదేరి శిరిడీ వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకోండి' అని బాబా సందేశం ఇచ్చారు. ఆ మెసేజ్ మాకోసమే అనిపించింది.
2025, ఏప్రిల్ 29న ఒక అద్భుతం జరిగింది. ఆరోజు మేము శిరిడీలో స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి సిద్ధమవుతున్నాము. సాయంత్రం 4 గంటలకు మా మొబైల్‌లో, "నేను శిరిడీ నుండి మీ ఇంటికి వస్తున్నాను" అని ఒక బాబా సందేశం వచ్చింది. ఆ సందేశం మాకేనని మాకు తెలుసు. అది వచ్చిన 5 నిమిషాలకు మాకు పరిచయమున్న ఒకరు వచ్చి 15 నిమిషాలు మా అమ్మాయితో మాట్లాడి తిరిగి వెళుతూ ఒక చిన్న కవరు ఇచ్చి వెళ్లారు. ఆ కవర్ తెరిచి చూస్తే, అందులో చిన్న బాబా పంచలోహ విగ్రహముంది. మా ఆనందానికి అంతులేదు. ఎందుకంటే, మర్నాడు శిరిడీ వెళ్ళడానికి బయలుదేరుతున్న మావద్దకు బాబా స్వయంగా శిరిడీ నుండి వచ్చి, మమ్మల్ని తమతో తీసుకెళ్ళబోతున్నారని. ఎన్ని జన్మల పుణ్యఫలమో మా కుటుంబానిది.
2025, ఏప్రిల్ 30 సాయంత్రం బెంగళూరులోని మా అమ్మాయివాళ్ళ సొంత ఇంటిలోని సామానంతా ప్యాకర్స్ మూవర్స్ లారీలో తీసుకెళ్లగా మేము రాత్రి 8 గంటలకు నిత్యం పూజించే బాబా మూర్తితో కారులో బయలుదేరి మర్నాడు మే 1, రాత్రి 8:30కి శిరిడీ చేరుకున్నాము. బాబా చరణాల వద్దకు చేరుకున్నామని చెప్పవచ్చు. 24 గంటలు పట్టిన ప్రయాణంలో బాబా మాతో ఉండబట్టి మాకు ఎటువంటి అలసట, ఆపద, ప్రమాదాలు లేవు.
Baba me prema anthulenidi..mimmalni nammukunavallanu eppudu vidichipettaru jai sadguru Sainath Maharaj ki jai!!! Om Sairam!!!
ReplyDelete