సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 2067వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. సాయినాథుని ఊదీ సంజీవని
2. బాబా చేసిన మేలు

సాయినాథుని ఊదీ సంజీవని

పిలిచినంతనే పలికే దైవం, అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీసాయినాథునికి ప్రణామాలు. నా పేరు జ్యోతి. ఈ బ్లాగు సాయి భక్తులకు నిజంగా ఒక వరం. ఎంతోమంది సాయిభక్తుల అనుభవాలను ఈ బ్లాగులో చదువుతున్నప్పుడు చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. సాయితండ్రి నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశారు. వాటిలో నుండి కొన్ని ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను. ఒకసారి ఊరిలో ఉన్న మా ఇంటిని శుభ్రం చేయించాలని పనివాళ్ళని రమ్మని చెప్పాను. నేను వెళ్లి వాళ్ళచేత శుభ్రం చేయించాలి. నాకు కూడా చాలా పని ఉంటుంది. అయితే ఆరోజు ఉదయం నిద్రలేచేసరికి నాకు చాలా నీరసంగా ఉండి అస్సలు లేచే ఓపిక లేకుండా పోయింది. అక్కడ చూస్తే, అప్పటికే పనివాళ్ళు వచ్చేసారు. నేనున్న స్థితిలో మేమున్న ఊరి నుంచి ఆ ఊరికి ప్రయాణం చేయాలంటే చాలా భయమేసింది. అయినా సాయినాథుని మీద భారమేసి కొద్దిగా ఊదీ నుదిటికి పెట్టుకొని, మరికొంత ఊదీ నీటిలో కలుపుకొని తాగి, "సహాయం చేయమ"ని బాబాను ప్రార్థించి బయలుదేరాను. అలా వెళ్లిన నేను ఆ రోజంతా దుమ్ము, ధూళిలో ఎంతో కష్టపడి చాలా పని చేశాను. అంత పని చేసినా సాయంత్రం వరకు ఎటువంటి అలసట తెలియలేదు. ఇంటికొచ్చాక కానీ ఉదయం నా పరిస్థితి నాకు గుర్తు రాలేదు. అంత ఓపిక, శక్తి ఎక్కడినుండి వచ్చాయో అనిపించింది. ఎక్కడినుండి ఏముంది? ఆ సాయినాథుడే లేచి నిలబడలేనంత నీరసంగా ఉన్న నాకు ఎంత పని చేసినా అలసిపోనంత శక్తిని తమ ఊదీతో ఇచ్చారు. కొన్నిసార్లు మన ఒంట్లో అస్సలు బాగాలేనప్పుడు చాలా పెద్ద పనులు చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు అంత త్వరగా ఆహారం ఇవ్వలేని శక్తిని మన తండ్రి సాయినాథుడు ఇవ్వగలరు. ఆయన ఊదీ పరమ ఔషధంగా అనంతమైన శక్తిని ఇవ్వగలదు.

ఇంకోసారి హఠాత్తుగా నా నడుము పట్టేసింది. నొప్పి చాలా ఎక్కువైపోయి మందులు వేసుకున్నా తగ్గలేదు. ఏ పనీ కాదు కదా నా పనులు కూడా చేసుకోలేకపోయాను. నిలబడలేకపోయాను, కూర్చోలేకపోయాను. పడుకున్నా భయంకరమైన నొప్పితో విలవిలలాడిపోయాను. నాకు చాలా భయమేసింది. డాక్టర్ దగ్గరకి వెళ్తే ఏ స్కానింగ్లో, సర్జరీలో అంటారని భయమేసింది. అది అంతటి భయంకరమైన నొప్పి. ఆ నొప్పితో నాలుగు రోజులు ఇబ్బందిపడిన తర్వాత నాకెందుకో 'బాబా ఊదీ రాసుకొని ఉండొచ్చు కదా!' అనిపించింది. అప్పటివరకు బాబాని "నొప్పి తగ్గించమ"ని వేడుకుంటున్నా బాబా ఊదీని ఉపయోగించాలని గుర్తు రాలేదు. ఇక వెంటనే బాబా ఊదీ నీటిలో కలిపి నొప్పి ఉన్నచోట రాశాను. అంతే! ఇంకా సాయితండ్రి అద్భుతం చూడండి. అరగంటలో నొప్పి చాలావరకు తగ్గిపోయింది. అస్సలు కదలలేకపోయినా నేను అరగంట తర్వాత ఇంటి పనులు మామూలుగా చేసుకున్నాను. ఇలా ఎన్నోసార్లు సాయినాథుడు నన్ను రక్షించారు.  ఎప్పుడు, ఎక్కడ నొప్పి వచ్చినా, ఎవరికైనా అనారోగ్యంగా ఉన్నా ఆ సాయినాథుని ఊదీ సంజీవని. సాయినాథుని దయతో మరిన్ని అనుభవాలను త్వరలోనే మీతో పంచుకుంటాను. సాయితండ్రికి నా హృదయపూర్వక కృతజ్ఞతా ప్రణామములు.

బాబా చేసిన మేలు

ఓంసాయి శ్రీసాయి జయజయసాయి. నా పేరు లలిత. ఒకసారి మా చిన్న పాపకి కడుపులో నొప్పి బాగా వచ్చింది. టాబ్లెట్లు వాడినా నొప్పి తగ్గలేదు. అప్పుడు నేను బాబాకి దణ్ణం పెట్టుకొని పాప నుదిటికి కొంచెం ఊదీ పెట్టి, మరి కొంచెం ఊదీ నోటిలో వేసాను. తర్వాత కొద్దిసేపటికి పాప నొప్పి తగ్గింది. నాకు చాలా ఆనందమేసి సాయికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను.

ఇంకోసారి మా బావగారికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. 'హార్ట్‌లో రెండు బ్లాకులు ఉన్నాయని, స్టంట్లు వేయాలని' డాక్టర్ చెప్పారు. నేను చాలా టెన్షన్ పడి బాబాకి దణ్ణం పెట్టుకొని ఆ ఆపరేషన్ సక్సెస్ అవ్వాలని అనుకున్నాను. బాబా దయవల్ల రెండు స్టంట్లు వేశారు. అతను క్షేమంగా ఇంటికి వచ్చారు. నేను ప్రతి సంవత్సరం కనుమ పండక్కి నా కన్నవారి ఇంటికి వెళ్తాను. అలాగే ఈ సంవత్సరం(2026) వెళ్ళాలనుకున్నాను. కానీ ఈసారి సరిగా ఆ సమయానికి నా తోడికోడలు బయట వుంది. బావ గారు పేషెంట్. అతనిని, అలాగే కొద్దిరోజుల ముందే పుట్టిన వాళ్ళ మనవరాలిని వదిలేసి ఎలా వెళ్లడమని కనుమ రోజు వెళ్లలేదు. తర్వాత వెళదామంటే పిల్లలకి కాలేజీలు ఉంటాయి. అందుకని బాబాని గుర్తు చేసుకొని, "బాబా! నేను ఎలా అయినా కన్నవారి ఇంటికి వెళ్ళేలా చేయండి" అని దణ్ణం పెట్టుకున్నాను. బాబా దయవలన నా తోడుకోడలు ఇంట్లోకి వచ్చాక తను పిల్లల్ని చూసుకుంటానన్నది, ఇంట్లో అందరూ నేను వెళ్ళడానికి ఒప్పుకున్నారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. మీ మేలు ఈ జన్మలో నేను మర్చిపోలేను. ఎప్పుడూ మమ్మల్ని ఇలాగే కాపాడుతూ ఉండండి. మీ పాదాలందు స్థిరమైన నమ్మకం, భక్తి, శ్రద్ధలు కలిగి ఉండేటట్లు నన్ను ఆశీర్వదించండి బాబా".

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo