ఈ భాగంలో అనుభవాలు:
1. 'నేను ఉండగా ఎందుకు భయపడుతున్నావు?'
2. అడిగినంతనే గొడవ సద్దుమణిగేలా అనుగ్రహించిన బాబా
3. బాబా దయ ఉంటే అనుకున్నవన్నీ జరుగుతాయి
'నేను ఉండగా ఎందుకు భయపడుతున్నావు?'
నా పేరు ఆనంద్‌విహార్. 2025, డిసెంబర్లో నేను, నా సోదరుడు, మా నాన్న అయ్యప్ప దీక్ష తీసుకొని అయ్యప్పస్వామి దర్శనార్థం శబరిమల వెళ్ళాము. సాయినాథుని దయవల్ల మాకు రెండుసార్లు అద్భుతమైన దర్శనం మరియు హరివరాసనం(అభిషేకం) చూసే అరుదైన భాగ్యం లభించింది. తర్వాత అనంతపద్మనాభస్వామి ఆలయానికి వెళ్లి అద్భుతమైన దర్శనంతో మేము తిరుగు ప్రయాణమయ్యేందుకు సిద్దమయ్యాము. కానీ తిరుగు ప్రయాణానికి మాకు టిక్కెట్లు లేవు. అయినప్పటికీ మేము వెంటనే తిరిగి రావాల్సి ఉండటంతో రైల్వేస్టేషన్‌కి వెళ్లి జనరల్ టికెట్ తీసుకున్నాము. కానీ మేము ఎక్కబోయే ట్రైన్ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వెళుతున్నందున అది ఎలా ఉంటుందో? చిన్నవాడైన నా సోదరుడు సర్దుబాటు కాగలడో, లేదో అని నేను భయపడ్డాను. బాబాను, "మీరు ఉన్నారనే ధైర్యంతో మేము దీక్ష తీసుకున్నాము. కానీ ఇప్పుడు ఇదేమిటి? దయచేసి మాకు సురక్షితం, సౌకర్యవంతం అయినా ప్రయాణాన్ని ఏర్పాటు చేయండి" అని ప్రార్థించాను. అప్పుడు అకస్మాత్తుగా, "నేను ఇక్కడ ఉండగా ఎందుకు భయపడుతున్నావు?" అని నాకు ఒక స్వరం వినిపించింది. తర్వాత మా నాన్న టీసీ దగ్గరకి వెళ్లి, "ఏదైనా రిజర్వ్ కోచ్‌లో ప్రయాణించేందుకు మాకు టికెట్లు ఇమ్మ"ని అడిగారు. ఆశ్చర్యకరంగా ఆ టీసీ మా ముగ్గురికి థర్డ్ ఏసీ టిక్కెట్లు ఇచ్చారు. నిజానికి మేము ముందు చూసినప్పుడు ఆ కోచ్‌లు నిండుగా ఉన్నాయి. సాయినాథుని కృపవల్ల మేము సురక్షితంగా ఇంటికి తిరిగి చేరుకున్నాము. తరువాత ఒకరోజు రాత్రి నేను, నా సోదరుడు తీవ్రమైన ఒళ్ళునొప్పులు భరించలేక బాధపడ్డాము. అప్పుడు మా అమ్మ సర్వశక్తిమంతుడైన సాయినాథుని, మా ఒళ్లునొప్పులు తగ్గేలా అనుగ్రహించమని ప్రార్థించి, మా ఇద్దరికీ పవిత్రమైన, శక్తివంతమైన ఊదీ ఇచ్చింది. సాయినాథుని దయతో నొప్పులు మాయమయ్యాయి. మేము ఆరోగ్యంగా ఉన్నాము. సాయినాథ్ మహారాజుకు నమస్కారాలు.
అడిగినంతనే గొడవ సద్దుమణిగేలా అనుగ్రహించిన బాబా
సాయి బంధువులందరికీ నమస్కారం. నేను సాయి భక్తురాలిని. పెళ్లయ్యాక నాకు, నా భర్తకి మధ్య ఎప్పుడు ఏ సమస్య వచ్చినా 10 రోజులకి మించి ఎప్పుడూ మాట్లాడుకోకుండా ఉండక ఇద్దరిలో ఎవరో ఒకరం మాట్లాడి గొడవని ఆపేసేవాళ్ళము. అయితే ఇటీవల ఒకసారి జరిగిన గొడవలో నాకు నా భర్త ప్రవర్తన అస్సలు నచ్చలేదు. నేను కోపంలో కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత విషయం ప్రస్తావించి నా భర్తని ప్రశ్నించాను. దాన్ని ఆయన చాలా సీరియస్‌గా తీసుకున్నారు. అందువల్ల నేను అలా మాట్లాడటంలో నా తప్పు లేకపోయినప్పటికీ మేము ఒక నెల మాట్లాడుకోలేదు. అప్పుడు నాకెందుకో ఇది కరెక్ట్ కాదనిపించి బాబాని తలుచుకుని, "వచ్చే గురువారం లోపు నా భర్త మారి ఈ గొడవ ఇక్కడితో సమసిపోవాలి" అని అనుకొని శిరిడీ నుండి తెచ్చిన ఊదీ నీళ్ళలో కలుపుకొని తాగాను. తర్వాత నా భర్త, "ఈ సమస్యని ఇక్కడితో ఆపేసి నేను ఇంతకు ముందులా మామూలుగా ఉండాలనుకుంటున్నాను" అని మెసేజ్ చేసారు. నేను ఆ మెసేజ్ చూసి, 'వాళ్ల అమ్మ ఏమైనా నచ్చజెప్పరేమో అనుకున్నాను'. కానీ తర్వాత తెలిసింది, 'వాళ్ల అమ్మ ఆశలు ఏం చెప్పలేదు, తనే మారారు' అని. అంతేకాదు, తను మెసేజ్ చేసింది గురువారం నాడు అని తెలిసి షాకయ్యాను. "ధన్యవాదాలు బాబా. మీకు కాకడ ఆరతి ఇవ్వాలని 2 సంవత్సరాల నుండి అనుకుంటున్నాను. కానీ నా వల్ల అస్సలు అవ్వట్లేదు. అది జరిగేలా నువ్వే చూడు బాబా. ఇంట్లో నిన్ను వదిలి నాకు ఎక్కడికీ వెళ్ళనిలేదు. దయచేసి ఎక్కడికీ పంపించకు బాబా. రోజూ మిమ్మల్ని శుభ్రం చేసి, మీకు రోజూ 4 అరతులిచ్చి, మంచిగా పూజ చేసి, తిండి పెట్టి సచ్చరిత్ర పారాయణ చేయాలని ఉంది. దానికే నా జీవితంలో మొదటి ప్రాధాన్యత. ఆ రోజులు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నాను బాబా. తొందరగా అనుగ్రహించండి బాబా".
బాబా దయ ఉంటే అనుకున్నవన్నీ జరుగుతాయి
నా పేరు స్రవంతి. మా అమ్మ ఉద్యోగస్తురాలు. ఒకసారి మా ఇంటి నుంచి మూడు గంటల దూర ప్రాంతానికి తనకి బదిలీ అయింది. అప్పుడు నేను, "బాబా! ఎలాగైనా ఈ బదిలీ ఆగిపోయి అమ్మ ఎక్కడికీ వెళ్లాల్సిన పని లేకుండా ప్రస్తుతం ఉన్న చోటనే తను కొనసాగేలా చూడండి" అని బాబాని దృఢంగా వేడుకున్నాను. అంతే, బాబా బదిలీ ఆపేసి అమ్మ ఎక్కడైతే ఉద్యోగం చేసుకుంటుందో అక్కడే కొనసాగేలా అనుగ్రహించారు.
నా పెళ్లి తేదీ అన్నీ చూసుకొని నిర్ణయించినప్పటికీ ఎప్పుడూ సమయానికి వచ్చే నా నెలసరి పెళ్లికి ముందు రాలేదు. అప్పుడు నేను, "బాబా! ఎలాగైనా ఎటువంటి ఆటంకం లేకుండా నా పెళ్లి జరిగేలా చూడండి" అని బాబాని ప్రార్థించాను. బాబా దయవల్ల ఎటువంటి ఆటంకం లేకుండా అనుకున్న విధంగా నా పెళ్లి జరిగింది.
నేను ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. ఒకసారి నాకు రావాల్సిన డబ్బులు రాలేదు. అప్పుడు నేను, "బాబా! ఎలాగైనా నాకు రావాల్సిన డబ్బులు వచ్చేలా చూడండి" అని బాబాను గట్టిగా ప్రార్థించాను. బాబా దయవల్ల కొన్నినెలలకి నాకు రావలసిన డబ్బులు నాకు వచ్చాయి. ఇలా ఒక విషయంలో కాదు, చాలా సందర్భాల్లో బాబాని నమ్ముకొని గట్టిగా ప్రార్థించినప్పుడల్లా నాకు కావాల్సినవన్నీ జరిగాయి. బాబా దయ ఉంటే మనం అనుకున్నవన్నీ జరుగుతాయని నా గట్టి నమ్మకం.
